Breaking News

నెట్ఫ్లిక్స్పై ఆగ్రహజ్వాలలు


 ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్పై ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్న నెట్ఫ్లిక్స్ను వెంటనే నిషేధించాలని పలు హిందూసంఘాలు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ట్విట్టర్ ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో #BoycottNetflix అన్న హాష్ట్యాగ్ ప్రస్తుతం ట్రెండింగ్గా మారింది. గత కొన్నిగంటల నుంచి ఈ హాష్ట్యాగ్ అత్యధికంగా ట్రెండ్ అయ్యింది. అసలు కారణం ఇదే.. నెట్ఫ్లిక్స్లో కొన్ని వారాలుగా 'ఏ సుటబుల్ బాయ్' అనే వెబ్సీరిస్ ప్రసారం అవుతోంది. అయితే ఈ వెబ్సీరిస్లో కథపరంగా ఓ హిందూ అమ్మాయిని.. ఓ ముస్లిం యువకుడు ప్రేమిస్తుంటాడు. మొదటి నుంచి ఈ వెబ్సీరిస్పై విమర్శలు వస్తున్నాయి. అయితే తాజాగా విడుదలైన ఎపిసోడ్లో సదరు ముస్లిం యువకుడు..

ఓ గుడిలో హిందూ అమ్మాయిని ముద్దుపెట్టుకొనే సీన్ ఉంది.

ఆ దేవాలయంలో కొందరు భక్తులేమో భజనలు చేస్తుంటే ముస్లిం యువకుడు మాత్రం.. అమ్మాయితో రొమాన్స్ చేస్తూ ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు. ఈ సీన్పై పలు హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ సన్నివేశం లవ్జీహాదిని ప్రోత్సహించేలా ఉన్నదని.. ఈ సినిమాను నెట్ఫ్లిక్స్ను వెంటనే నిషేధించాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంపై ఇప్పటికే 66 వేలకు పైగా ట్వీట్లు వచ్చాయి.

మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా కూడా ఈ విషయంపై స్పందించారు. ఓ వర్గాన్ని కించపరిచేలా ఉన్న ఈ సినిమాను నిషేధించాలని కోరారు. మరోవైపు ట్విట్టర్లో ఈ విషయంపై వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. ఓ యువతి ట్విట్టర్లో శృంగారశిల్పాలు ఉన్న ఓ ఆలయ చిత్రాన్ని పోస్ట్చేశారు. 'ఇదే మనదేశ సంస్కృతి.. కానీ మీరేమో సంస్కృతి పాడైపోతుందని తెగ ఫీలవుతున్నారు..' అంటూ ట్వీట్ చేశారు. మొత్తానికి ఇవాళ నెట్ఫ్లిక్స్ను బ్యాన్చేయాలంటూ కొన్ని వేల సంఖ్యలో ట్వీట్లు వచ్చాయి. దానికి మద్దతుగా వచ్చిన ట్వీట్లు పదుల సంఖ్యలోనే ఉన్నాయి. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ప్రేమించే వాళ్లంతా నెట్ఫ్లిక్స్ను అన్ఇన్స్టాల్ చేసుకోవాలని ఓ వ్యక్తి ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చాడు. నెట్ఫ్లిక్స్ మనదగ్గర డబ్బులు తీసుకొని మన సంస్కృతిని వెక్కిరిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.