Breaking News

మళ్లీ ముంబైకే ఐపీఎల్ కిరీటం


 ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ కొత్త చరిత్ర సృష్టించింది..! ఎవరికీ సాధ్యంకాని రీతిలో ఐదోసారి టైటిల్‌ను సొంతం చేసుకుంది..! బౌలింగ్‌లో ట్రెంట్‌ బౌల్ట్‌ (3/30) ఇచ్చిన శుభారంభాన్ని అందుకున్న కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (51 బాల్స్‌లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 68) బ్యాటింగ్‌లో రెచ్చిపోయాడు..! దీంతో మామూలు టార్గెట్‌ను ముంబై ఈజీగా ఛేదించేసింది..! మరోవైపు శ్రేయస్‌ అయ్యర్‌ (50 బాల్స్‌లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 65 నాటౌట్‌), రిషబ్‌ పంత్‌ (38 బాల్స్‌లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 56) చెలరేగినా.. బౌలర్లు అంచనాలను అందుకోలేకపోవడంతో.. ఢిల్లీ ఫైనల్‌ ఫోబియాను అధిగమించలేకపోయింది..! ఫలితంగా ఫస్ట్‌ టైమ్‌ టైటిల్‌ గెలిచే సువర్ణావకాశాన్ని చేజేతులా జారవిడుచుకుంది..!!


దుబాయ్‌: ఎవరు ఎన్ని అంచనాలు వేసినా.. ఎన్ని వ్యూహాలు పన్నినా.. ఐపీఎల్‌-13 టైటిల్‌.. డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌నే వరించింది. లీగ్‌, నాకౌట్‌ దశలో అదరగొట్టిన ఢిల్లీ.. టైటిల్‌ పోరులో మాత్రం చతికిలపడిపోయింది. దీంతో ఈ సీజన్‌లో నాలుగోసారి ముంబై చేతిలో ఓడి టైటిల్‌ గెలిచే గొప్ప చాన్స్‌ను మిస్‌ చేసుకుంది. ఫలితంగా మంగళవారం ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో ముంబై 5 వికెట్ల తేడాతో ఢిల్లీపై గెలిచి టైటిల్‌ నిలబెట్టుకుంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 రన్స్‌ చేసింది. తర్వాత ముంబై 18.4 ఓవర్లలో 5 వికెట్లకు 157 రన్స్‌ చేసింది. ఇషాన్‌ కిషన్‌ (19 బాల్స్‌లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 33 నాటౌట్‌) రాణించాడు. బౌల్ట్​కు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌'అవార్డు లభించాయి.


బౌల్ట్‌ దెబ్బ..


భారీ టార్గెట్‌ నిర్దేశించాలన్న ఉద్దేశంతో ముందుగా బ్యాటింగ్‌కు వచ్చిన ఢిల్లీ ఆశలపై బౌల్ట్‌ (3/30) నీళ్లు కుమ్మరించాడు. ఇన్నింగ్స్‌ ఫస్ట్‌ బాల్‌కే స్టోయినిస్‌ (0)ను డకౌట్‌ చేశాడు. గుడ్‌ లెంగ్త్‌తో వేసిన షార్ట్‌ బాల్‌ను ఆడే క్రమంలో స్టోయినిస్‌ కీపర్‌ డికాక్‌కు చిక్కాడు. ధవన్‌ (15) మూడు ఫోర్లతో టచ్‌లోకి వచ్చినా.. థర్డ్‌ ఓవర్‌లో బౌల్ట్‌ మళ్లీ దెబ్బ కొట్టాడు. సేమ్‌ బాల్‌ను ఈసారి లెగ్‌సైడ్‌ సంధించాడు. ఫ్లిక్‌ చేయబోయిన రహానె (2) డికాక్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. అయ్యర్‌ ఫోర్‌తో ఖాతా తెరవగా, నాలుగో ఓవర్‌లోనే స్పిన్నర్‌ జయంత్‌ (1/25) రంగంలోకి వచ్చాడు. జోష్‌ మీదున్న ధవన్‌ను మంచి టర్నింగ్‌ బాల్‌తో పెవిలియన్‌కు పంపాడు. దీంతో 22 రన్స్‌కే 3 కీలక వికెట్లు కోల్పోయి ఢిల్లీ కష్టాల్లో పడింది.