Breaking News

ప్రయోగం విజయవంతం!


 ఉపరితల లక్ష్యాలను ఛేదించేందుకు ఉద్దేశించిన బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగాన్ని భారత్ ఆర్మీ విజయవంతంగా చేపట్టింది. మంగళవారం నాడు అండమాన్ నికోబార్ ద్వీపంలో చేపట్టిన ప్రయోగంలో బ్రహ్మోస్ మిసైల్ మరో ద్వీపంపై ఉన్న ఉపపరితల లక్ష్యాన్ని అనుకున్న రీతిలో ఛేదించగలిగింది. ఈ క్రమంలో మిస్సైల్ సామర్థ్యంలో 400 కిలోమీటర్లలోని లక్ష్యాలను ఛేదించగలిగే స్థాయికి చేరుకుందని ఆర్మీ వర్గాలు తెలిపాయి.

భూమి, సముద్రం, గాలిలో నుంచి ప్రయోగించేందుకు వీలైన క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ అన్న విషయం తెలిసిందే. భారత్ రక్షణ రంగ పరిశోధన సంస్థ డీఆర్‌డీఓ, రష్యా భాగస్వామ్యంలో ఈ క్షిపణిని అభివృద్ధి చేసింది. బ్రహ్మోస్‌కు సంబంధించి ఇప్పటికే భారత్‌ ఆర్మీ, నేవీ విభాగాల్లో కొన్ని రెజిమెంట్లు అందుబాటులో ఉన్నాయి.

నౌకలను, భూ ఉపరితల లక్ష్యాలను ఛేదించేందుకు రెండు వర్షన్లు డీఆర్‌డీఓ సిద్ధం చేసింది. భారత్, రష్యాల భాగస్వామ్యంలో నెలకొల్పిన బ్రహ్మోస్ ఎయిరోస్పేస్ ఈ క్షిపణుల్ని ఉత్పత్తి చేస్తుంది. కాగా..బ్రహ్మోస్‌తో పాటూ యుద్ధ ట్యాంకులను నిర్వీర్యం చేయగలిగే లేజర్ గైడెడ్ మిస్సైల్‌తో పాటు అణ్వాయుధ ప్రయోగానికి అనువైన శౌర్య సూపర్ సానిక్ క్షిపణిని కూడా భారత్ ఇటీవల విజయవంతంగా పరీక్షించింది.