Breaking News

సీఎం కేసీఆర్ ప్రకటించిన సహాయక చర్యల పట్ల ధన్యవాదాలు అంటూ చిరంజీవి ట్వీట్


 సినిమా ఇండస్ట్రీ కోలుకునేందుకు సీఎం కేసీఆర్ ప్రకటించిన సహాయక చర్యల పట్ల ధన్యవాదాలు అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. కరోనా ప్రభావంతో కుంగిపోయిన చిత్ర పరిశ్రమను ప్రభుత్వ నిర్ణయాలు కచ్చితంగా పునరుజ్జీవింప చేస్తాయని నమ్ముతున్నామని తెలిపారు. సినీ రంగంపై సీఎం కేసీఆర్ కురిపించిన వరాల జల్లుతో ఇండస్ట్రీ మళ్లీ అభివృద్ధి బాటలో నడుస్తుందని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. నాగార్జున స్పందిస్తూ, సీఎం కేసీఆర్ కు ఎంతో రుణపడి ఉంటామని తెలిపారు. తీవ్ర సంక్షోభ సమయంలో సీఎం కేసీఆర్ స్పందించిన తీరు పట్ల ధన్యవాదాలు అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు. కరోనా మహమ్మారి వల్ల తీవ్రంగా నష్టపోయిన తెలుగు చిత్రసీమకు సీఎం కేసీఆర్‌ భరోసా కల్పించారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాగంగా అధికార తెరాస మేనిఫెస్టోలో టాలీవుడ్‌కు కూడా స్థానం కల్పించారు. తెలుగు చిత్ర పరిశ్రమకు పలు హామీలు ఇచ్చారు. కరోనా దెబ్బతో తీవ్ర ఆర్థిక నష్టాలు చవిచూసిన టాలీవుడ్‌ను కాపాడుకోవటానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని కేసీఆర్‌ అన్నారు. ఈ క్రమములోనే సినిమా థియేటర్ల ఓపెనింగ్‌కు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 50 శాతం సీటింగ్‌తో తెలంగాణలో సినిమా థియేటర్లకు అనుమతి ఇస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ సర్కార్.