Breaking News

అమెరికాలో జరిగిన ఎన్నికల్లో నెల్లూరు జిల్లా వాసి సత్తా


 అమెరికాలో జరిగిన ఎన్నికల్లో నెల్లూరు జిల్లా వాసి సత్తా చాటారు. నెల్లూరు జిల్లాకు చెందిన చలంచెర్ల ఏడుకొండలు ఘన విజయం సాధించారు. కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఫోల్సమ్ ఎన్నికల్లో అత్యధిక ఓట్ల మెజారిటీతో కౌన్సిల్‌ మెంబర్‌గా ఎన్నిక అయ్యారు. నెల్లూరు జిల్లా విడవలూరులోని సామాన్య గిరిజన కుటుంబంలో ఏడుకొండలు జన్మించారు. ఇంటర్మీడియట్ వరకు ఇదే గ్రామంలో చదువుకున్న ఏడుకొండలు.. ఆ తర్వాత ఎస్వీ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో ఇంజినీరింగ్ చదివారు. అనంతరం యూనివర్సిటీలో కో- ఆపరేటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు. తర్వాత సివిల్స్ రాసి ఐఈఎస్ అధికారిగా ఎంపికయ్యారు. కొన్నాళ్ల పాటు ఇండియాలోనే పనిచేశారు. ఈ సమయంలోనే ఐఏఎస్ అధికారి కుమార్తెను వివాహం చేసుకున్నారు.తర్వాత ఏడుకొండలు కొన్నాళ్ల పాటు సింగపూర్‌లో ఉన్నారు. ప్రస్తుతం అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఫోల్సమ్ సిటీలో స్థిరపడ్డారు. అక్కడే అవుతార్ ఐటీ సొల్యూషన్ స్థాపించి సీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన ఎక్కువగా సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. ఏడుకొండలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 200 మంది గిరిజన విద్యార్థులను చదివిస్తున్నారు. సొంతూరు విడవలూరులోనూ పాఠశాల అభివృద్ధికి తన వంతు సహాయం అందించారు. అమెరికా ఎన్నికల్లో తమ ప్రాంత వాసి విజయం సాధించడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.