Breaking News

అమెరికా ఎన్నికల తంతు ముగిశాక జరుగుతున్నదేంటీ..?


 అమెరికా ఎన్నికల తంతు ముగిశాక జరుగుతున్నదేంటీ..? బైడెన్‌ను అడ్డుకోవటానికి రిపబ్లికన్లు వేస్తున్న లిటిగేషన్లను కోర్టులు తిరస్కరిస్తుంటే..అమెరికాలో అరాచకానికి పన్నాగం జరుగుతున్నదా..? అసలేం జరుగుతున్నది.. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో బైడెన్‌ గెలిచారు. వైట్‌హౌస్‌ అధిపతిగా ఉన్న ట్రంప్‌ మాత్రం.. కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు బైడెన్‌ను అంగీకరించడంలేదు. రిపబ్లికన్లు కోర్టులో వందలాది కేసులేస్తున్నారు. డెమొక్రాట్లు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినట్టు వ్యాజ్యాలు దాఖలు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు వేసిన కేసులలో అధిక శాతం ఆధారాల్లేవనే కారణంతో అక్కడి కోర్టులు కొట్టివేస్తున్నాయి.


అయినా కేసుల పరంపర కొనసాగుతూనే ఉన్నది. తాజాగా ట్రంప్‌ ట్వీట్‌చేస్తూ 'మనం పెద్ద పురోగతిని సాధించనున్నాం. ఫలితాలు వచ్చే వారం నుంచి రావడం ప్రారంభమవుతాయి. అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా మారుద్దాం. మనం గెలిచి తీరుతాం' అని పోస్టు చేశారు. ఎన్నికల అవకతవకలమీద వచ్చిన కేసులను విచారణకు తీసుకోవాలని అమెరికా ప్రభుత్వ ప్రధాన న్యాయమూర్తి బార్ర్‌ ఆదేశాలు జారీ చేశారు. సత్వరమే ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై విచారణ షురూ చేయాలని ఆదేశాల్లో ప్రస్తావించారు. దీనికి నిరసనగా న్యాయశాఖ ప్రధానాధికారి రాజీనామా చేశారు. అలానే కేసులు వాదించేందుకు ట్రంప్‌ న్యాయవాదుల్ని నియమించుకున్నారు. వారు కూడా ఇది అన్యాయమంటూనే..మీ కేసు వాదించమంటూ గుడ్‌బై చెప్పేస్తున్నారు. ప్రజలు ఎన్నుకున్న బైడెన్‌ను కాదని ఇలా కోర్టుల చుట్టూ ట్రంప్‌ వేస్తున్న వ్యూహాలతో అమెరికాలో అరాచకానికి పన్నాగమని రాజకీయపరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బైడెన్‌ జనవరి 20న పదవి ప్రమాణస్వీకారం చేయాల్సిఉన్నది. అయితే అధ్యక్షుడి హోదాలో అధికార మార్పిడి ఏర్పాట్ల కోసం వచ్చే బైడెన్‌ మనుషులకు సహకరించవద్దని ట్రంప్‌ హుకూం జారీ చేస్తున్నారు. దీంతో అమెరికాలో రాజకీయ అస్థిరత నెలకొనే ప్రమాదం లేకపోలేదన్న చర్చ నడుస్తున్నది.

ఫైజర్‌ మందుల కంపెనీపైన ట్రంప్‌ నిందారోపణలు చేస్తున్నారు. ఎన్నికల తర్వాత తను కనుగొన్న వ్యాక్సిన్‌ గురించి ఫైజర్‌ సంస్థ వెల్లడించి.. తన ఓటమికి కారణమైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అమెరికా రక్షణ మంత్రి పాంపియో అధికార మార్పిడి విషయంలో అన్యాయంగా మాట్లాడుతున్నారు. జనవరి 20న బైడెన్‌ ప్రమాణస్వీకారం చేసి శ్వేతసౌధ్యంలో అధికార పగ్గాలు చేపట్టాల్సి ఉన్నది. కానీ పాంపియో జనవరి20న ట్రంప్‌ అధికారకొనసాగింపు మాత్రమే జరుగుతుందని బైడెన్‌కు అధికార మార్పిడి జరగదని హెచ్చరిస్తున్నారు. ఇది జనవరి 20 మధ్యాహ్నం 12:1 గంటలకు రుజువవుతుందని చెప్పుకొచ్చారు. దీన్ని ప్రపంచ దేశాలు అంగీకరించడానికి సిద్దం కావాలని కోరారు. పాంపియోను పత్రికా విలేకరులు ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న పరిణామాల నేపధ్యంలో అమెరికా ఇతర దేశాల్లో స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరగాలని ప్రకటనలు జారీచేయడం ఎంతవరకు సమంజసమని అడిగితే పాంపియో ఇది బాధ్యతా రహితమైన ప్రశ్నఅని కొట్టి పడేశారు.