Breaking News

అమెరికాలో అనిశ్చితి


 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రెసిడెంట్‌ ట్రంప్‌, డెమొక్రాటిక్‌ అభ్యర్థి బిడెన్‌ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. లక్షలాది ఓట్లు ఇంకా లెక్కించాల్సి ఉన్నందున విజేత ఎవరో తేలడానికి కొన్ని రోజులు పట్టవచ్చు. కడపటి వార్తలందేసరికి మొత్తం 538 మంది ప్రతినిధులుండే ఎలక్టొరల్‌ కాలేజీలో డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి బిడెన్‌కు 224 సీట్లు లభించగా, అధ్యక్షుడు ట్రంప్‌కు 213 సీట్లు లభించాయి.

మిగతా నూటొక్క సీట్లలో సగానికిపైగా స్థానాల్లో బిడెన్‌ మంచి ఆధిక్యతలో ఉన్నారు. ఈ ధరోణి ఇలాగే కొనసాగితే బిడెన్‌ విజయం సాధిస్తారు. ఎలక్టొరల్‌ కాలేజీలో వెరికి 270 సీట్లు లభిస్తే వారే అధ్యక్షులవుతారు. జార్జియా, ఉత్తర కరోలినా, పెన్సిల్వేనియాల్లో ఇంకా ఓట్ల లెక్కింపు పూర్తికాకుండానే అక్కడ తాను గెలుపొందినట్లు అధ్యక్షుడు ట్రంప్‌ బుధవారం తెల్లవారుజామున శ్వేత సౌధంలో తప్పుగా ప్రకటించుకున్నారు. ప్రస్తుతం సాగుతున్న ఓట్ల లెక్కింపును 'మన దేశంపై జరుగుతున్న ప్రధానమైన మోసం' అని అసహనం వ్యక్తం చేశారు. 'అమెరికా సుప్రీం కోర్టులో కూడా మనం గెలవబోతున్నాం.' అని ఆయన చెప్పారు. 'ఇక ఓట్ల లెక్కింపులన్నింటినీ నిలుపుచేయాలని భావిస్తున్నాం.' అన్నారు.పలు కీలక రాష్ట్రాల్లో ఇంకా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
అంతకుముందు డెమోక్రాట్‌ అభ్యర్థి జో బిడెన్‌ మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో గెలుపు దిశగా పయనిస్తున్నామని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రతి ఓటు లెక్కించబడేవరకు ఇది తుది తీర్పు కాదని స్పష్టం చేశారు. కీలకమైన రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నందున ఓపికతో వేచి చూడండని ఆయన తన మద్దతుదారులకు విజ్ఞప్తి చేశారు. కాలిఫోర్నియా, న్యూయార్క్‌, ఇలినాయిస్‌, న్యూజెర్సీ, విర్జీనియా, వాషింగ్టన్‌, మాసాచుసెట్స్‌, మేరీలాండ్‌, మినెసోటా, కొలరాడో, కనెక్టికట్‌, హవాయి, ఆరెగాన్‌, న్యూ మెక్సికో, న్యూహాంప్‌షైర్‌, రోడ్స్‌ ఐలండ్‌, వెర్మాంట్‌, డెలావేర్‌ రాష్ట్రాలతోబాటు కొలంబియా జిల్లాలో , నెబ్రస్కాలో బిడెన్‌ విజయ పథంలో ఉండగా, అధ్యక్షుడు ట్రంప్‌ టెక్సాస్‌, ఫ్లోరిడా, ఓహియో, ఇండియానా, టెన్సీసీ, మిస్సోరి, అలబామా, సౌత్‌ కరోలినా, కెంటకీ, లూసియానా, ఓక్ల హామా, అర్కాన్సాస్‌, ఐయోవా, కాన్సాస్‌, మిసిసిపి, ఉటా, వెస్‌ విర్జీనియా, ఇడాహో, మొంతానా, సౌత్‌ డకోటా, నార్త్‌ డకోటా, వ్యోమింగ్‌లలో గెలుపు బాటలో ఉన్నారు.
కీలక సెనెట్‌ సీట్లు రిపబ్లికన్ల కైవసం?
సెనేట్‌ పోటీలో ఫలితాలు చూస్తుంటే డెమోక్రాట్లకు అనుకూలంగా రెండు సీట్ల ఫలితం తారుమారవగా, ఒక స్థానంలో రిపబ్లికన్లకు అనుకూలంగా తారుమారైంది. కొలరాడోలో మాజీ గవర్నర్‌ జాన్‌ హికెన్‌లూపర్‌ (డెమోక్రాట్‌) రిపబ్లికన్‌ సెనెటర్‌ కోరీ గార్డెనర్‌ను ఓడించారు. అరిజోనాలో డెమోక్రాట్‌ అభ్యర్ధి మార్క్‌ కెల్లీ రిపబ్లికన్‌ సెనెటర్‌ మార్తా మెక్‌సెల్లీని ఓడించారు. అలబామాలో రిపబ్లికన్‌ సెనెటర్‌ టామీ టుబర్‌విల్లె డెమోక్రాట్‌ అభ్యర్ధి డౌగ్‌ జోన్స్‌ను ఓడించారు. ఉత్తర కరోలినాలో 94శాతం ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సమయానికి ఇరు వర్గాల అభ్యర్ధుల మధ్య గట్టి పోటీ నెలకొంది. కాగా, పలువురు రిపబ్లికన్‌ సెనెటర్లు అసాధారణ పోటీని ఎదుర్కొంటూ గెలుపొందగలిగారు. కాన్సాస్‌లో రిపబ్లికన్‌ రోజర్‌ మార్షల్‌ డెమోక్రాట్‌ అభ్యర్ధి బార్బారా బాలియర్‌ను ఓడించారు. జార్జియా ఎన్నిక రనాఫ్‌ దిశగా సాగుతోంది.
ఫ్లోరిడాలో ప్రతినిధుల సభ సీట్లు గెలుచుకున్న రిపబ్లికన్లు, ఉత్తర కరోలినాలో డెమొక్రాట్ల విజయం
ఇంతవరకు వెల్లడైన ఫలితాలను బట్టి ప్రతినిధుల సభలో డెమోక్రాట్లు తమ మెజారిటీని నిలబెట్టుకుంటున్నారు. కానీ దక్షిణ ఫ్లోరిడాలో రెండు సీట్లు కోల్పోయారు. జార్జియాలోని 14వ కాంగ్రెస్‌ డిస్ట్రిక్ట్‌లో డెమోక్రాట్‌ కెవిన్‌ వాన్‌ అశుదాల్‌పై రిపబ్లికన్‌ టేలర్‌ గ్రీన్‌ గెలుపొందారు. అందరి దృష్టి ఆకర్షించిన మరో పోటీలో ఉత్తర కరోలినాలోని 11వ డిస్ట్రిక్ట్‌లో రిపబ్లికన్‌ మాడిసన్‌ కాథర్న్‌ డెమోక్రాట్‌ అభ్యర్ధి మో డేవిస్‌ను ఓడించారు. గతంలో ఈ స్థానం ప్రస్తుత వైట్‌హౌస్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా వున్న మార్క్‌ మెడోస్‌ది. ఉత్తర కరోలినాలో మరో రెండు సీట్లలో డెమోక్రాట్లు ఫలితాలను తారుమారు చేశారు. జార్జియాలోని 6వ డిస్ట్రిక్ట్‌లో డెమోక్రాట్‌ లూసీ మెక్‌బాత్‌ రిపబ్లికన్‌ కరేన్‌ హాండెల్‌ను ఓడించారు. దక్షిణ ఫ్లోరిడాలో రిపబ్లికన్లు రెండు సీట్లలో ఫలితాలను తారుమారు చేశారు. అక్కడ డెమోక్రాట్‌ అభ్యర్ధులు ఇరువురు పరాజయాన్ని చవి చూశారు.