Breaking News

జేడీయూకు ఆర్జేడీ ఆహ్వానం


 రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరని రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) రుజువు చేస్తోంది. బిహార్ శాసన సభ ఎన్నికల్లో ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు కలిసి మహా కూటమిగా ఏర్పడి, ఎన్డీయే కూటమికి వ్యతిరేకంగా పోటీ చేశాయి. ఈ ఎన్నికలు పూర్తయి రెండు వారాలైనా పూర్తి కాకముందే ఆర్జేడీ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూను మహా కూటమిలోకి ఆహ్వానించింది.

ఆర్జేడీ సీనియర్ నేత అమర్‌నాథ్ గామి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మహా కూటమిలోకి రావాలన్నారు. కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్‌కు నితీశ్ నాయకత్వం వహించాలన్నారు. బిహార్‌లో ఎన్డీయే ప్రభుత్వం ఎంతో కాలం ఉండదన్నారు.

ఇటీవల పూర్తయిన బిహార్ శాసన సభ ఎన్నికల్లో ఎన్డీయే సాధించిన ఆధిక్యత ఆ కూటమి ప్రభుత్వం సుస్థిరంగా కొనసాగేందుకు సరిపోదన్నారు. నితీశ్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందన్నారు. ఎన్డీయే ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి పదవిని చేపడతారని పేర్కొన్నారు.

బిహార్ శాసన సభలో 243 స్థానాలు ఉన్నాయి. ఈ నెల 10న వెలువడిన శాసన సభ ఎన్నికల ఫలితాల ప్రకారం ఎన్డీయే కూటమికి 125 స్థానాలు లభించాయి. ఒక స్వతంత్ర ఎమ్మెల్యే కూడా ఈ కూటమికి మద్దతిస్తున్నారు. బీజేపీ 74, జేడీయూ 43, హెచ్ఏఎం 4, వీఐపీ 4 స్థానాల్లో విజయం సాధించాయి.

మహా కూటమికి 110 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆర్జేడీ 75, కాంగ్రెస్ 19, వామపక్షాలు 16 స్థానాలను దక్కించుకున్నాయి. ఏఐఎంఐఎం 5 స్థానాల్లో గెలవగా, బీఎస్‌పీ, ఎల్‌జేపీ చెరొక స్థానంలో విజయం సాధించాయి.