Breaking News

నివర్ కన్నా డేంజరస్...మరో తుఫాన్..


 2020 సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఎవరికీ కలిసొచ్చేలా లేదు. ఓ వైపు కరోనాతో చాలామంది ఉద్యోగాలు పోయాయి. అనేకమంది ఉపాధి కోల్పోయారు. రోడ్డున పడ్డారు. పల్లెటూర్లలో ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుంటున్న వాళ్లకు తుఫాన్ లు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ ఏడాది వచ్చిన అతివృష్టితో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో రైతులు ఎంతో నష్టపోయారు. హైదరాబాద్ మహానగరం వరదల తో అతలాకుతలం అయ్యింది. ఇటీవల వచ్చిన నివర్ తుఫాన్‌తో కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌లలో తీవ్ర నష్టం వాటిల్లింది. రాయలసీమలోని పలు జిల్లాల్లో పంట ఆస్తి నష్టం సంభవించింది. అయితే ఇప్పటికే నివర్‌తో జనం అతలాకుతలం అవుతుంటే బంగాళాఖాతం లో మరో అల్పపీడనం పొంచిఉందని వాతావరణ శాఖ అధికారులు బాంబు పేల్చారు.

ప్రస్తుతం బంగాళాఖాతంలోని ఆగ్నేయదిశగా అల్పపీడనం ఏర్పడిందని.. అది తీవ్ర రూపం దాల్చిందని అధికారులు చెప్పారు. ఇది పెను తుఫాన్‌గా పరిణమించే అవకాశం ఉందని అధికారులు హెచ్చిరిస్తున్నారు. మరో 48 గంటల్లో ఈ తీవ్ర అల్పపీడనం.. తుఫాన్ గా మారొచ్చని భారత వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.

దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ తమిళనాడు లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. మంగళవారం నుంచి ఆయా రాష్ట్రాల్లో భారీనుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం బంగాళాఖాతం ఉపరితలం మీద 30 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం రాబోయే తుఫాన్.. నివర్ కంటే ప్రమాదకరమైనదని అధికారులు అంటున్నారు. ఇప్పటికే నివర్ తుఫాన్ తెలుగు రాష్ట్రాల్లో తీరని నష్టాన్ని మిగిల్చింది. అనంతరం కడప చిత్తూరు జిల్లాల్లో భారీ నష్టం వాటిల్లింది. ఇక ఇప్పుడు రాబోయే తుఫాన్ ఎలా ఉండ బోతుందోనని రైతులు ప్రజలు ఆందోళన చెందుతున్నారు.