Breaking News

ఆర్మేనియా విదేశాంగ మంత్రి రాజీనామా


 వేర్పాటువాద ప్రాంతమైన నాగొర్నొ-కరబాక్‌ను దీర్ఘకాల శత్రువైన అజర్‌బైజాన్‌కు వదులుకోవాలని కోరుతున్న కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో దేశంలో తలెత్తిన రాజకీయ సంక్షోభం మధ్య సోమవారం అర్మేనియా విదేశాంగ మంత్రి తన పదవికి రాజీనామా చేశారు. రష్యా మధ్యవర్తిత్వంతో కుదిరిన ఈ ఒప్పందం ఇరు దేశాల మధ్య ఘర్షణను నిలువరించింది. గత ఆరువారాలుగా సాగిన ఈ ఘర్షణల్లో వందలాదిమంది మరణించారు. అయితే, అజర్‌బైజాన్‌కు సరిహద్దుల్లో గల కరబాక్‌ ప్రాంతానికి వెలుపల తనకు పట్టు వున్న కొన్ని ప్రాంతాలను ఆర్మేనియా వదులుకోవాల్సి వుంటుందని ఆ ఒప్పందం పేర్కొంటోంది. అజర్‌బైజాన్‌ పరిధిలోనే నాగొర్నొ-కరబాక్‌ ప్రాంతం వుంది.

కానీ ఆర్మేనియా బలగాల నియంత్రణలో వుంది. 1994లో వేర్పాటువాద యుద్ధం ముగిసినప్పటి నుండి ఇదే పరిస్థితి నెలకొంది. ఆ యుద్ధం కారణంగా కరబాక్‌ ప్రాంతమే కాకుండా ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ఆర్మేనియా చేతుల్లోకి వచ్చాయి. తాజాగా కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంతో అజర్‌బైజాన్‌లో సంబరాలు చేసుకున్నారు.

అదే సమయంలో ఆర్మేనియాలో పెద్ద ఎత్తున నిరసనలు మొదలయ్యాయి. వేలాదిమంది వీధుల్లోకి వచ్చి ప్రధాని గద్దె దిగాలంటూ డిమాండ్‌ చేశారు. విదేశాంగ మంత్రిని డిస్మిస్‌ చేయాలని నిర్ణయించినట్లు ప్రధాని పార్లమెంట్‌లో ప్రకటించిన వెంటనే విదేశాంగ మంత్రి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రతినిధి వెల్లడించారు. ఫేస్‌బుక్‌లో ఆయన రాసిన రాజీనామా లేఖను పోస్ట్‌ చేశారు.