Breaking News

కరోనా వైరస్ కు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి


 ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి గజగజా వణికిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా బాధితుల సంఖ్య, కరోనా మృతుల సంఖ్య పెరుగుతుండగా శాస్త్రవేత్తల అధ్యయనాల్లో కరోనా వైరస్ కు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శాస్త్రవేత్తలు కరోనా వైరస్ గురించి పరిశోధనలు చేసి కరోనా వైరస్ మ్యుటేషన్ల వల్ల కేసుల సంఖ్య పెరిగినట్టు తమకు ఎటువంటి ఆధారాలు లభించలేదని తెలిపారు.

గత కొన్ని నెలల నుంచి శాస్త్రవేత్తలు కరోనా వైరస్ లో మార్పులు చోటు చేసుకుంటున్నట్టు వెల్లడించారు. అయితే తాజా శాస్త్రవేత్తల అధ్యయనంలో మ్యుటేషన్ల వల్ల వైరస్ వ్యాప్తి పెరగదని తేలడంతో ప్రజల్లో కరోనా వైరస్ కు సంబంధించిన భయాందోళన కొంతవరకు తగ్గినట్టే అని చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా 46,000 మంది నుంచి శాంపిల్స్ సేకరించి శాస్త్రవేత్తలు ఈ విషయాలను వెల్లడించారు.

కరోనా వైరస్ మ్యుటేషన్ల వల్ల వైరస్ సంక్రమణ లేదా లక్షణాల తీవ్రత పెరిగిందా అనే అంశంపై పరిశోధనలు చేసి మ్యుటేషన్లు వైరస్ వ్యాప్తికి కారణం కాదని శాస్త్రవేత్తలు తేల్చారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 6 కోట్లు దాటగా మృతుల సంఖ్య 14 లక్షలు దాటింది. పలు దేశాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నా మరణాల సంఖ్య తగ్గడం గమనార్హం.

శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం కరోనా వైరస్ మూడు రకాలుగా మ్యుటేషన్ అవుతోందని తెలుస్తోంది. 12,706 వరకు మ్యుటేషన్లను శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో గుర్తించారు. 398 మ్యుటేషన్ల గురించి బలమైన ఆధారాలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.