Breaking News

తొలిసారి ఐపీఎల్ ఫైనల్ లోకి అడుగుపెట్టిన ఢిల్లీ


 ఐపీఎల్‌-13వ సీజన్‌ క్వాలిఫయర్‌-2లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ విజయాన్ని అందుకుంది. ఢిల్లీ నిర్దేశించిన 190 పరుగుల లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్‌ తడబడింది. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 రన్స్ చేసి.. 17 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కేన్ విలియమ్సన్‌ (67: 45 బంతుల్లో 5ఫోర్లు, 4సిక్సర్లు) అర్ధ శతకంతో ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఢిల్లీ బౌలర్లలో కాగిసో రబాడ 4, మార్కస్‌ స్టోయినీస్ 3 వికెట్లు పడగొట్టారు. ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు ఐపీఎల్ చరిత్రలో తొలిసారి ఫైనల్‌కు చేరుకుంది. మంగళవారం జరిగే టైటిల్ పోరులో ముంబై ఇండియన్స్ జట్టుతో తలపడనుంది.

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మూడు వికెట్ల నష్టానికి ఢిల్లీ కేపిటల్స్ జట్టు 189 పరుగులు చేసింది.ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌, మార్కస్‌ స్టోయినీస్‌ రాణించారు. స్టోయినీస్‌ 38 పరుగులు చేసి పెవిలియన్ చేరినా.. ధావన్ సిక్స్ బాది తన హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ధావన్ 26 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. స్టోయినీస్‌ అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ వచ్చి నిలకడగా ఆడాడు. భారీ షాట్స్ ఆడే క్రమంలో 20 బంతుల్లో 21 పరుగులు చేసి అయ్యర్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన హెట్మయర్ కూడా రాణించడంతో సన్ రైజర్స్ ముందు భారీ లక్ష్యం చేరింది. ఆఖరి రెండు ఓవర్లు సన్ రైజర్స్ బౌలర్లు పరుగుల వేగాన్ని అడ్డుకున్నారు. ధావన్ 50 బంతుల్లో 78 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో రెండు సిక్సర్లు, 6 ఫోర్లు ఉన్నాయి. హెట్మయర్ 22 బంతుల్లో 42 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. పంత్ మూడు బంతుల్లో 2 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. సన్ రైజర్స్ ఫీల్డర్లు చేసిన తప్పుల కారణంగా ఢిల్లీ భారీ స్కోరు చేయగలిగింది. హోల్డర్, సందీప్, రషీద్ ఖాన్ చెరో వికెట్ తీశారు.

భారీ లక్ష్య చేధనకు దిగిన సన్‌రైజర్స్‌కు ఆదిలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఓపెనర్ డేవిడ్‌ వార్నర్‌ (2) కాగిసో రబాడ వేసిన రెండో ఓవర్‌ తొలి బంతికి బౌల్డ్‌ అయ్యాడు. ఇక ప్రియం గార్గ్ (17), మనీష్‌ పాండే (21)లు పరుగు తేడాలో ఔట్‌ కావడంతో సన్‌రైజర్స్‌ 44 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. జాసన్ హోల్డర్‌ (11; 15 బంతుల్లో, 1×4)తో కలిసి కేన్ విలియమ్సన్‌ ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. హోల్డర్‌ను అక్షర్‌ పటేల్‌ అవుట్ చేశాడు. విలియమ్సన్‌ మాత్రం తన క్లాస్ ను చూపిస్తూ వెళ్ళాడు. 35 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. కేన్, అబ్దుల్‌ సమద్‌ (33; 16 బంతుల్లో 2ఫోర్లు, 2సిక్స్‌లు)లు బాగా ఆడుతూ ఉండడంతో విజయం మీద ఆశలు రేగాయి. స్టోయినీస్‌ 17వ ఓవర్‌లో విలియమ్సన్‌ ను ఔట్‌ చేయడంతో సన్ రైజర్స్ ఆశలు ఆవిరయ్యాయి. రబాడ ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు తీయడంతో హైదరాబాద్‌ ఓటమి ఖరారైంది. రషీద్‌ ఖాన్‌ (11), గోస్వామి (0), నదీమ్‌ (2), సందీప్‌ (2) పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో రబడా నాలుగు వికెట్లు సాధించగా, స్టోయినిస్‌ మూడు వికెట్లు తీశాడు.