Breaking News

'గ్రేటర్' లో టీడీపీ


 పోలింగుకు ముందే ఏ పార్టీ అయినా చేతులెత్తేస్తే జనాల ముందు ఎంత పలుచనైపోతుంది ? ఇపుడీ పరిస్దితి తెలుగుదేశంపార్టీకి వచ్చినట్లే ఉంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి) ఎన్నికల్లో టీడీపీ కూడా పోటీ చేస్తోంది. గెలుపు కోసం మిగిలిన పార్టీలు ప్రధానంగా అధికార టీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం పార్టీలు ఏ విధంగా ప్రయత్నిస్తున్నాయో అందరు చూస్తున్నదే. పై పార్టీల తరపున పోటీ చేస్తున్న అభ్యర్ధులు ప్రచారంలో ప్రత్యర్ధి పార్టీలపై పై చేయి సాధించేందుకు నానా అవస్తలు పడుతున్నారు.ఉదయం లేచిన దగ్గర నుండి మందీ మార్బలాన్ని వెంటనేసుకుని డివిజన్లలో కళ్ళరిగేలా అభ్యర్ధులు తిరుగుతున్నారు. వీళ్ళు సొంతంగా చేసుకుంటున్న ప్రచారంతో సంబంధం లేకుండా స్టార్ క్యాంపైనర్లు వేరే ఉన్నారు.

పై మూడు పార్టీల్లో స్టార్ క్యంపైనర్లనే వాళ్ళు యావత్ గ్రేటర్ పరిధిలో మంటలు మండిస్తున్నారు. బీజేపీ తరపున అధ్యక్షుడు బండి సంజయ్ కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో పాటు చాలా మంది నేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. మొత్తం 150 డివిజన్లకు గాను బీజేపీ 149 చోట్ల పోటీ చేస్తోంది.

ఇక టీఆర్ఎస్ తరపున కేటీయార్ ఒకవైపు ప్రచారం చేస్తుంటే మరోవైపు మంత్రులు ఎంపిలు ఎంఎల్ఏలు నేతలు డివిజన్లలో విస్తృతంగా తిరుగుతున్నారు. 150 డివిజన్లలోను టీఆర్ఎస్ అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. ఇదే పద్దతిలో ఎంఐం తరపున ఒకవైపు అధ్యక్షుడు ఎంపి అసదుద్దీన్ మరోవైపు ఎంఎల్ఏ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ అక్బురుద్దీన్ ప్రచారంలో రెచ్చిపోతున్నారు. ఎంఐఎం తరపున 51 డివిజన్లలో అభ్యర్ధులు రంగంలో ఉన్నారు. వీళ్ళు పరిమితి డివిజన్లలోనే పోటీ చేస్తున్నా ప్రచారాన్ని మాత్రం చాలా ఉధృతంగా చేస్తున్నారు.

మరి పై పార్టీలు ప్రచారంలో హీటు పుట్టించేస్తుంటే టీడీపీ అభ్యర్ధులు మాత్రం పెద్దగా కనబడటం లేదు. 104 డివిజన్లలో పోటీ చేస్తున్నా ఎక్కడా పెద్దగా హడావుడి కనబడటం లేదు. పైగా చాలా డివిజన్లలో నామినేషన్లు వేసిన అభ్యర్ధులు ప్రత్యర్ధుల్లో బలమైన వారితో కలిసిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. అంటే పోటీ విషయంలో చాలా చోట్ల టీడీపీ అభ్యర్ధులు చేతులెత్తేసినట్లే అర్ధమవుతోంది. ఎన్నికల్లో ఎటువంటి ప్రభావం చూపలేనపుడు మరి ఇంతమందిని ఎందుకు పోటీలోకి దింపారు ? అన్నదే ఎవరికీ అర్ధం కావటం లేదు.

టీడీపీ తరపున పోటి చేస్తున్న వాళ్ళకి ఓట్లేయాలంటే చంద్రబాబునాయుడును చూసే ఓట్లేయాలి. అంతే కానీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణను చూసి ఎవరు ఓట్లేయరన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటిది చంద్రబాబు ప్రచారం చేయటానికి కాలు బయటపెట్టలేదు. లోకేష్ అసలు హైదరాబాద్ లోనే లేరు. నందమూరి బాలకృష్ణ ఎక్కడున్నారో కూడా తెలీదు. ఇంతోటిదానికి గ్రేటర్ లో పోటీకి ఎందుకు దిగారో కూడా ఎవరికీ అర్ధం కావటం లేదు. అందుకనే అభ్యర్ధులు కూడా ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారట. చివరకు కాంగ్రెస్ తరపున కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అండ్ కో ప్రచారం చేస్తున్నారు. అలాంటిది టీడీపీకి ఏమైంది ?