Breaking News

కీళ్లసంబంధ వ్యాధులన్నవారిపై కరోనా ప్రభావం తక్కువే!


 వాషింగ్టన్‌: కరోనా మహమ్మారి ఉనికిలోకి వచ్చిననాటినుంచి పరిశోధకులు దానిపై అధ్యయనాలు చేస్తూనే ఉన్నారు. దీంతో రోజుకో కొత్త విషయం తెలుస్తోంది. కాగా, కీళ్ల సంబంధ వ్యాధులున్నవారిలో (రుమాటిక్‌ డిసీజెస్‌) ఈ వ్యాధి తక్కువ ప్రభావం చూపిందని తాజా పరిశోధనలో తేలింది. సోకినవారిలోనూ స్వల్ప లేదా మధ్యస్థ లక్షణాలే కనిపించాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అలాగే, మరణాల సంఖ్య కూడా తక్కువగా ఉందని తేల్చారు.

అమెరికన్ కాలేజ్ ఆఫ్ రుమటాలజీ వార్షిక సమావేశంలో ఏసీఆర్‌ కన్వర్జెన్స్‌లో ఈ పరిశోధన వివరాలను సమర్పించారు. గాల్వెస్టన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ మెడికల్ బ్రాంచ్‌లో అధ్యయనం నిర్వహించారు. రుమాటిక్ వ్యాధి ఉన్న రోగులలో కొవిడ్‌-19 ప్రభావంపై 2020 జనవరి నుంచి జూన్ వరకు ఉన్నడేటాను విశ్లేషించారు.

6,095 మంది రుమాటిక్‌ డిసీజెస్‌తో (ఇందులో 28% మంది రుమటాయిడ్ ఆర్థరైటిస్ , 7% మంది సోరియాటిక్ ఆర్థరైటిస్) బాధపడుతున్నవారిని నిశితంగా పరిశీలించారు. ఇందులో 123 మంది లేదా కేవలం 2% మాత్రమే కరోనాబారినపడ్డట్లు తేల్చారు. ఇందులో 91 లేదా 73% మంది దవాఖానలో చేరకుండానే కొవిడ్‌ నుంచి కోలుకున్నట్లు కనుగొన్నారు. అలాగే, 13 మంది మాత్రమే ఐసీయూలో చేరారని, నలుగురు కొవిడ్‌తో కన్నుమూసినట్లు గుర్తించారు. దీనికి గల కారణాలను కచ్చితంగా తెలుసుకునేందుకు ఇంకా అధ్యయనం కొనసాగించాల్సిన అవసరముందని పరిశోధకులు పేర్కొన్నారు.