Breaking News

నేడు ఆర్‌సీబీతో ఎలిమినేటర్‌


 అబుదాబి: స్టార్టింగ్‌లో తడబడి చివర్లో చెలరేగి ప్లే ఆఫ్స్‌కు దూసుకొచ్చిన మాజీ చాంపియన్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కీలక సమరానికి సిద్ధమైంది. హ్యాట్రిక్‌ విక్టరీలతో ఫుల్‌ కాన్ఫిడెన్స్‌లో ఉన్న వార్నర్‌సేన శుక్రవారం జరిగే ఎలిమినేటర్‌లో బెంగళూరుతో తలపడనుంది. సరైన టైమ్‌లో జోరు పెంచిన హైదరాబాద్‌ పాయింట్స్‌ టేబుల్‌లో థర్డ్‌ ప్లేస్‌లో ప్లే ఆఫ్స్‌కు వచ్చింది. ఢిల్లీ క్యాపిటల్స్‌, ఆర్‌సీబీని ఓడించి రేసులో నిలిచిన వార్నర్‌సేన ఆఖరి లీగ్‌లో టేబుల్‌ టాపర్‌ ముంబైని పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. దాంతో, కాన్ఫిడెన్స్‌ డబుల్‌ అవగా.. ఈ పోరులో రైజర్స్‌ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. మరోవైపు ఆరంభంలో అదరగొట్టి చివర్లో వరుసగా నాలుగు ఓటములు ఎదుర్కొన్న ఆర్‌సీబీ నాలుగో ప్లేస్‌తో ముందుకొచ్చింది. ఓడితే మరో చాన్స్‌ లేని స్థితిలో ఆ జట్టు రైజర్స్‌కు ఏ మేరకు పోటీ ఇస్తుందో చూడాలి.

ఈ ఇద్దరి హవా

కాస్త లేటుగా జోరు పెంచిన రైజర్స్‌ సక్సెస్‌లో కెప్టెన్‌ వార్నర్‌, సాహాకు క్రెడిట్‌ ఇవ్వాలి. బెయిర్‌స్టో ప్లేస్‌లో చివరి దశలో టీమ్‌లోకి వచ్చిన సాహా.. కెప్టెన్‌తో కలిసి మంచి ఓపెనింగ్స్‌ ఇస్తున్నాడు. ఢిల్లీపై 107, ముంబైపై 151 రన్స్‌ పార్ట్‌నర్‌షిప్స్‌ ఇవ్వడంతో జట్టు ప్లే ఆఫ్స్‌లోకి వచ్చింది. సీజన్‌లో 529 రన్స్‌ చేసిన వార్నర్‌ టీమ్‌ను ముందుండి నడిపిస్తుండగా.. సాహా మూడు ఇన్నింగ్స్‌ల్లోనే 184 రన్స్‌తో ఫుల్‌ ఫామ్‌లో ఉన్నాడు. వీరిద్దరూ అదే జోరు కొనసాగిస్తే టీమ్‌కు తిరుగుండదు. మనీశ్‌ పాండే, కేన్‌ విలియమ్సన్‌ కూడా ఫామ్‌లో ఉండగా, లేట్‌గా ఎంట్రీ ఇచ్చిన హోల్డర్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ రాణిస్తుండడంతో మిడిలార్డర్‌ కష్టాలు తీరాయి. బౌలింగ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌కు తిరుగులేదు. పవర్‌ప్లేలో సందీప్‌ సెన్సేషనల్‌ బౌలింగ్‌తో విజృంభిస్తుండగా.. డెత్‌ ఓవర్లలో నటరాజన్‌ రన్స్‌ కట్టడి చేస్తున్నారు. హోల్డర్‌ నుంచి వీరికి మంచి సపోర్ట్‌ లభిస్తోంది. మిడిల్‌ ఓవర్లలో రషీద్‌తో పాటు షాబాజ్‌ నదీమ్‌ తమ స్పిన్‌తో ప్రత్యర్థులను తిప్పలు పెడుతున్నారు.

ఆర్‌సీబీ పుంజుకుంటుందా?

తొలి తొమ్మిది మ్యాచ్‌ల్లో 7 విజయాలతో టాప్‌ ప్లేస్‌ కోసం పోటీ పడ్డ ఆర్‌సీబీ తర్వాత ఒక్కసారిగా డీలా పడింది. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓడినా రన్‌రేట్‌ బాగుండడంతో ముందంజ వేయగలిగింది. మరో తప్పిదం చేస్తే టోర్నీ నుంచి వైదొలిగే ప్రమాదం ఉండడంతో కెప్టెన్‌ కోహ్లీ పక్కా ప్లాన్‌తో రావాలి. ఢిల్లీతో లాస్ట్‌ మ్యాచ్‌లో ఆర్‌సీబీ టాపార్డర్‌ మొత్తం ఫెయిలైంది. జోష్‌ ఫిలిప్‌ శుభారంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోతున్నాడు కాబట్టి ఆరోన్‌ ఫించ్‌ను కోహ్లీ తిరిగి జట్టులోకి తీసుకునే చాన్సుంది. యంగ్‌ ఓపెనర్‌ దేవదత్‌ పడిక్కల్‌ ఫామ్‌లో ఉండడం ప్లస్‌ పాయింట్‌. అయితే, కోహ్లీ, ఏబీలో ఒకరు అతనికి సపోర్ట్‌ ఇవ్వాల్సిందే. తొడ కండరాల నొప్పితో బాధపడుతున్న క్రిస్‌ మోరిస్‌ దూరమైతే జట్టుకు కష్టాలు తప్పవు. చేతి గాయం నుంచి కోలుకున్న నవదీప్‌ సైనీ బరిలోకి దిగనున్నాడు. చహల్‌, సిరాజ్‌, సుందర్‌తో బౌలింగ్‌ బలంగానే ఉంది. అయితే, మిడిలార్డర్‌కు బలం చేకూర్చేందుకు ఉడాన ప్లేస్‌లో మొయిన్‌ అలీని దింపొచ్చు.