Breaking News

అర్నబ్ కు బెయిల్ నిరాకరణ


 రిపబ్లిక్‌ టీవీ చీఫ్‌ ఎడిటర్‌ అర్నబ్‌ గోస్వామికి బాంబే హైకోర్టు సోమవారం బెయిల్‌ నిరాకరించింది. బెయిల్‌ కోసం సెషన్స్‌ కోర్టును ఆశ్రయించాలని జస్టిస్‌ ఎస్‌ఎస్‌.షిండే, ఎంఎస్‌.కర్నిక్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సూచించింది. 2018లో ఇద్దరిని ఆత్మహతకు ప్రేరేపించారన్న కేసుకు సంబంధించి నిందితులుగా ఉన్న అర్నబ్‌తోపాటు మరో ఇద్దరిని పోలీసులు ఈ నెల 4న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అలీబాగ్‌ మేజిస్ట్రేట్‌ ఆదేశాలనుసారం వారికి 14 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీ విధించారు. మొదట అర్నబ్‌ను అలీబాగ్‌ జైలులోని క్వారంటైన్‌ సెంటర్‌లో ఉంచారు. అక్కడ ఆయన అక్రమంగా సెల్‌ఫోన్‌ వినియోగిస్తున్నారన్న ఆరోపణలతో ఆదివారం తలోజ జైలుకు తరలించారు.


రిపబ్లిక్‌ టివి, టైమ్స్‌ నౌ లకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

బాలీవుడ్‌కు సంబంధించి బాధ్యతారాహిత్యమైన, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యానాలు, కథనాలు ప్రసారం చేయకుండా రిపబ్లిక్‌ టీవీ, టైమ్స్‌ నౌ, ఇతర సోషల్‌ మీడియా సంస్థలను నిరోధించాలని కోరుతూ బాలివుడ్‌ సినిమా ఇండిస్టీస్‌ అసోసియేషన్‌తో పాటు 34 మంది సినిమా నిర్మాతలు దాఖలు చేసిన పిటిషన్‌పై సమాధానం చెప్పాలని ఢిల్లీ హైకోర్టు ఆ మీడియా సంస్థలను ఆదేశించింది. ఈ మేరకు సోమవారం నోటీసులు జారీచేసింది. విచారణ చేపట్టిన జస్టిస్‌ రాజీవ్‌ శఖ్దేకర్‌ న్యూస్‌ ఛానెళ్లు తమ ప్రసారాల సమయంలో కేబుల్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్‌ నిబంధనల ప్రకారం ప్రోగ్రామ్‌ కోడ్‌ను అనుసరించాలని సూచించారు. ఈ సందర్భంగా కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. చానెళ్లలో డిబేట్‌ల సందర్భంగా అందులో పాల్గొనేవారు వినియోగించే భాష దారుణంగా ఉంటుందని పేర్కొంది. రిపోర్టింగ్‌కు సంబంధించి బాధ్యతాయుతంగా స్వీయ నియంత్రణ ఉండాలని సూచించింది. సుశాంత్‌ సింగ్‌ మృతి నేపథ్యంలో పలు ఛానెళ్లు బాలీవుడ్‌పై అవాస్తవాలను ప్రచారం చేశాయని పిటిషన్‌దారులు పేర్కొన్నారు.

బాలీవుడ్‌ డ్రగ్గిస్ట్‌, మలినమైందని, అసహ్యకరమైనదని, పనికిరాని వ్యక్తులతో నిండిపోయిందంటూ ఛానెళ్లు వ్యాఖ్యానించాయని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. కేసు తదుపరి విచారణను కోర్టు డిసెంబర్‌ 14కు వాయిదా వేసింది.