Breaking News

భారత్ కు కరోనా వ్యాక్సిన్ ను అందించబోతున్నాం: ఫైజర్


 యూకే ప్రభుత్వం ఫైజర్ కరోనా వ్యాక్సిన్ కు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. మెసెంజర్‌ ఆర్‌ఎన్‌ఈ సాంకేతితతో ఫార్మా దిగ్గజం ఫైజర్‌ ఇంక్‌ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌కు ఔషధాలు, ఆరోగ్య ఉత్పత్తుల స్వతంత్ర నియంత్రణ సంస్థ(ఎంహెచ్‌ఆర్‌ఏ) మద్దతివ్వడంతో యూకే ప్రభుత్వం ఎమర్జెన్సీ కోసం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. అత్యవసర ప్రాతిపదికన తమ కరోనా వ్యాక్సిన్‌ వినియోగానికి యూకే ప్రభుత్వం అనుమతించడం కంపెనీ చరిత్రలో చరిత్రాత్మక ఘట్టమని ఫైజర్‌ సీఈవో ఆర్బర్ట్‌ బోర్లా ఆనందాన్ని వ్యక్తం చేశారు. కరోనా ఇతర దేశాల్లో రెండో వేవ్.. మూడో వేవ్.. వచ్చే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. అందుకోసమే ఎమర్జెన్సీ కింద వ్యాక్సిన్ లకు ప్రభుత్వాలు ఓకే చెప్పే అవకాశం ఉంది. జర్మన్‌ కంపెనీ బయోఎన్‌టెక్‌తో రూపొందించిన వ్యాక్సిన్‌ ఎమర్జెన్సీ వినియోగానికి అనుమతించమంటూ ఇటీవల యూఎస్‌ఎఫ్‌డీఏ, యూరోపియన్‌ ఔషధ నియంత్రణ సంస్థలకు ఫైజర్‌ దరఖాస్తు చేసింది. ఫైజర్‌ వ్యాక్సిన్‌ వినియోగానికి ఎంహెచ్‌ఆర్‌ఏ సమ్మతి ఇవ్వడంతో యూకే ప్రభుత్వం అమల్లోకి వచ్చే విధంగా ఆదేశాలు జారీ చేసింది. వచ్చే వారం నుంచి యూకేలో వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుంది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా తొలిసారి వ్యాక్సిన్‌ అధికారిక వినియోగానికి అనుమతించిన దేశంగా యూకే నిలిచింది.

భారతదేశానికి కూడా కరోనా వ్యాక్సిన్ అందించడానికి సిద్ధమవుతూ ఉన్నామని ఫైజర్ సంస్థ చెబుతోంది. భారతదేశానికి కరోనా టీకా అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఫైజర్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా టీకాను సరఫరా చేయాలని భావిస్తున్న ఫైజర్.. పలు దేశాలతో చర్చలు జరుపుతోంది. త్వరలోనే భారత ప్రభుత్వాన్ని కూడా సంప్రదిస్తామని, ఆ దేశానికి కూడా టీకాను అందించాలనుకుంటున్నామని ఫైజర్ చైర్మన్ అల్బర్టా బౌర్లా తెలిపారు.