Breaking News

ధైర్యంగా ముందడుగు

 

కరోనా దెబ్బకు సినీ రంగం అతలాకుతలమైంది. థియేటర్లు మూతపడడంతో కొత్త సినిమాలు విడుదలకు నోచుకోలేకపోయాయి. ఇక ఇటీవల లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా సినిమా హాళ్లు తెరుచుకోమని ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా థియేటర్ యాజమాన్యాలు మాత్రం ఆ సాహసం చేయలేకపోయాయి. తెరిస్తే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయోననే ఆందోళన అందరిలోనూ నెలకొంది. అయితే తాజాగా సూపర్‌స్టార్ మహేష్ బాబు భాగస్వామిగా వ్యవహరిస్తున్న ఏఎంబి సినిమాస్ మల్టీప్లెక్స్ చైన్ మాత్రం థియేటర్లు తెరుస్తున్నట్టు ప్రకటించింది.

ఈ డిసెంబర్ 4వ తేదీ నుండి సినిమా హాళ్లు తెరవనున్నట్టు అధికారికంగా ప్రకటన చేశారు. ఇక మంగళవారం నుండి టికెట్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి.

కరోనా తర్వాత ఇలా థియేటర్లు రీ ఓపెన్ చేస్తున్నట్టు ప్రకటన చేసిన మొదటి థియేటర్ చైన్ ఏఎంబి సినిమాస్ మాత్రమే కావడం విశేషం. మహేష్‌బాబు మల్టీప్లెక్స్ థియేటర్ల చైన్ ధైర్యంగా ముందడుగు వేయడం సంతోషకరమైన విషయమని పలువురు సినీ ప్రముఖులు హర్షం వ్యక్తంచేశారు. ఈ ప్రకటనతో కొన్ని నెలలుగా థియేటర్ అనుభూతిని మిస్ అయిన సినీ ప్రేమికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ బాబు బృందం చేస్తున్న ఈ ప్రయత్నం మంచి ఫలితాలనిస్తే త్వరలోనే ఇంకొన్ని మల్టీప్లెక్స్ థియేటర్లు తెరుచుకునే అవకాశం ఉంది.