Breaking News

ఆ రాష్ట్రం సంచలన నిర్ణయం!


 ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న అభ్యర్థులకు జార్ఖండ్ సర్కార్ సరికొత్త నిబంధన తీసుకురానుంది. కేవలం విద్యార్హతలు మాత్రమే కాకుండా ఆ నిబంధనను పాటించినవారికే ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించనున్నట్టు చెప్పింది. ఇంతకి ఆ నిబంధనల ఏమిటని అనుకుంటున్నారా?.. ప్రభుత్వ ఉద్యోగులు కావాలనుకునే అభర్థులు స్మోకింగ్ పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. రాష్ట్రంలో పొగాకు వినియోగం తగ్గించడంలో భాగంగానే జార్ఖండ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. పొగాకు, దాని ఉత్పత్తులకు దూరంగా ఉండేవారికే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని జార్ఖండ్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పొగాకు నమలడం, ధూమపానం చేయమని తెలిపేలా అఫిడవిట్లు సమర్పించాల్సి ఉంటుంది.

మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుఖ్దేవో సింగ్ నేతృత్వంలో జరిగిన పొగాకు నియంత్రణ సమన్వయ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎలాంటి పొగాకు ఉత్పత్తులను వినియోగించమని అఫిడవిట్లు సమర్పించాల్సి ఉంటుంది. ఈ నిబంధన 2021 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు రాష్ట్ర విద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నుంచి ఒక ప్రకటన వెలువడింది.అలాగే పాఠశాలకు 100 మీటర్ల దూరంలో ఎలాంటి పొగాకు ఉత్పత్తుల అమ్మకాలు చేపట్టిన దుకాణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పొగాకు నియంత్రణ సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అలాగే రాంచీ, ధన్‌బాద్, బోకారో, ఖుంతి, సారై కేలా-ఖర్సావన్, హజారిబాగ్‌లను పొగాకు రహిత జిల్లాలుగా ప్రకటించాలని నిర్ణయించారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు రంగ కార్యాలయాలు, ప్రధాన ద్వారాల వద్ద పొగాకు రహిత జోన్ అంటూ బోర్డులను ఉంచాలని జార్ఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుఖ్దేవో సింగ్ అధికారులను ఆదేశించారు.